మంగళవారం 9 సెప్టెంబర్ 2008

పోస్టు చేయని ఉత్తరం





జోరున వర్షం కురుస్తోంది, అమ్మతో కలిసి ఎంతో ఆనందంగా ఇంట్లో ఆడుకుంటున్నాడు రవి.

కాసేపటికి వర్షం తగ్గటంతో ఇంటి ముందు ఉన్న నీళ్ళలో పడవలతో ఆడుకోసాగాడు.


" రవీ నీళ్ళలో తడవకూ, లోపలికు రా ",అని రవి అమ్మ అరిచింది .

" ఈ ఒక్క రోజేకదా అమ్మా, నువ్వుకూడా రా ఆడుకుందాము",అని రవి అడిగాడు.

అమ్మతో కలిసి హాయిగా ఆడుకుంటున్నాడు

'అమ్మా ఇంకో పడవ చేసీవా' అని రవి అడిగాడు

రవి అమ్మ రవికి రెండు పడవలు చేసిచ్చింది


ఇంతలో ' రవి నుంచో ', అని ఎవరో అరిచినట్లు వినిపించింది

రవి ఉలిక్కిపడి లేచాడు, ఎదురుగా తెలుగు మాస్టారు,

'ఇప్పుడు ఏమి చెప్పానో చెప్పు ', అని మాస్టారు అడగగానే తలదించుకొని నిలబడ్డాడు రవి

'నేను వెళ్ళే దాకా అలాగే నిలబడి ఉండు, క్లాసులో నిద్రపోతావా?',

అని మాస్టారు పాఠం చెప్పసాగాడు.

అప్పుడు అర్థమైంది రవికి మాస్టారు చెప్పేది లేఖ గురించి అని.

' సెలవు కోరుచూ ప్రధానోపాధ్యాయునికి లేఖ , ఇది మీకు పది మార్కులకి ఇస్తాను ఈ సారి '

అని మాస్టారు చెప్పసాగారు.

అందరూ శ్రద్ధగా విన్నారు ,నిద్రమత్తు వదలటంతో రవికూడా విన్నాడు.


లంచ్ బెల్ కొట్టారు, అందరూ పరుగెడుతూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు

హాస్టల్ అంటే అలాగే ఉంటుంది మరి

భోజన సమయం అవటంతో అందరూ పళ్ళాలు పట్టుకోని భోజనానికి వెళ్తున్నారు

కాని రవి మాత్రం తెలుగు మాస్టారు చెప్పిన లేఖ గురించి ఆలోచించ సాగాడు.

' రవి వెళ్దాము రారా ', అని స్నేహితులు అడగగా

' మీరు వెళ్ళండిరా నేను తరువాత వెళ్తాను ', అని చెప్పి ఒంటరిగా రూములో కూర్చున్నాడు

మాస్టారు చెప్పిన లేఖ గురించే ఆలోచించ సాగాడు

దానిలొ ప్రధానోపాధ్యాయుడికి బదులు అమ్మకు లేఖ వ్రాయాలనిపించింది రవికి


రవికి అమ్మని చూసి చాలా రోజులైంది

హాస్టల్లో చేర్చినప్పటినుంచి అమ్మ మీద బెంగ పెట్టుకున్నాడు

అప్పుడప్పుడూ వాళ్ళ నాన్న వచ్చి చూసి వెళ్ళినా పన్నెండేళ్ళ రవికి మాత్రం అమ్మతోనే ఉండాలని ఆశ

అందుకే అమ్మకి లేఖ వ్రాయాలనిపించింది రవికి


మాస్టారు చెప్పిన నమూనా లేఖని దగ్గర పెట్టుకోని వ్రాయసాగాడు



******************************************************




తేది :10-02-95,

హైదరాబాద్.



అమ్మకి ,

మినర్వా పబ్లిక్ స్కూల్ ,

హైదరాబాద్.



విషయం:అమ్మని రమ్మని అడుగుతూ లేఖ

అమ్మా నేను రవిని. ఇప్పుడే క్లాసులు అయిపోయాయి,

అందరూ భోజనానికి వెళ్ళారు. నేను కాసేపు ఆగి వెళ్తాను. ఈరోజు లేఖ రాయటం ఎలాగో నేర్పించారు,

మొదటి లేఖ నీకే వ్రాస్తున్నాను.నాన్న ఎలా ఉన్నారు. మొన్న వస్తానన్నారు రాలేదు ఎందుకని ?

ఆ రోజు చాలామంది తల్లిదండ్రులు వచ్చారు, నేను మీకోసం చాలా సేపు చూసాను,

మీరెందుకు రాలేదు ? వాళ్ళందరినీ చూస్తే ఎందుకో నాకు ఏడుపొచ్చింది. ఇక్కడ ఒక సార్

వున్నారు తెలుసా ఆయన కూడా నాన్నలాగా భలే కధలు చెబుతారు.

నువ్వు ఎలా చదువుతున్నావు అని అడుగుతారు అంతేగా , నేను బాగానే చదువుతున్నాను.

క్లాసులో నాకు 4వ ర్యాంకు వచ్చింది . లెక్కల్లో 25/25 వచ్చాయి తెలుసా, లెక్కల

మాస్టారు నన్ను మెచ్చుకున్నారు కూడా. ఐనా ఎందుకో నాకు హాస్టల్ నచ్చలేదమ్మా,

నేను మన ఊరు వచ్చేస్తాను . వీళ్ళు ఇక్కడ నన్ను ఆడుకోనివ్వటం లేదు,

వర్షం లో తడవనివ్వటం లేదు , నాకు నచ్చినవి చేయనివ్వటం లేదు , రోజూ చదవమంటారు.

నాకు ఇక్కడ గోపి , రమేష్ అనే ఫ్రండ్సు ఉన్నరు తెలుసా . నువ్వు ఇక్కడకి వస్తే చూపిస్తా వాళ్ళని ,

నువ్వు కూడా నాతో ఆడతావు అంటుంటే వాళ్ళు నమ్మటం లేదు.

ఒక సారి నువ్వు వస్తే అందరం కలసి ఆడుకుందాం. ఈసారి సెలవులలో అమ్మమ్మావాళ్ళ

ఊరు వెళ్దాం, అక్కడ బాగా ఆడుకోవచ్చు, తాతతో కలిసి పొలంకి వెళ్ళచ్చు, ఐస్ క్రీములు,

చాక్లేట్లు తినచ్చు . తొందరగా సెలవలు వస్తేబాగుండు . నువ్వు మళ్ళీ ఎప్పుడు వస్తావు?

ఈ ఆదివారం వస్తావా, వచ్చేటప్పుడు నాకు తింటానికి బోలెడు చాక్లేట్లు తేవాలి .

చాక్లేట్లు తిసుకురాకపోయినా పర్లేదు నువ్వు మాత్రం తోందరగా రా. అమ్మా నన్ను మరచిపోవు కదా


ఇట్లు మీ విధేయుడు,

వి.రవి,

7 వ తరగతి,

మినర్వా పబ్లిక్ స్కూల్.


******************************************************

ఎప్పుడో తన చిన్నప్పుడు అమ్మకు వ్రాసిన ఉత్తరాన్ని చూస్తూ నవ్వుకున్నాడు రవి.

తను పోస్టు చేయని ఆ ఉత్తరాన్ని ఎప్పటికీ మరచిపోలేడు రవి .తన పర్సులో నుండి

అమ్మ ఫోటో తీసి చూసుకున్నాడు . తను ఈ ఉత్తరం రాయక ముందే అమ్మ చనిపోయిందని,

అందుకే తనను హాస్టల్లో చేర్చారని అప్పుడు రవికి తెలీదు.

తన చిన్నప్పుడే చనిపోయిన అమ్మని ఒకసారి గుర్తుతెచ్చుకొని తిరిగి తన పనిలో లీనమైపోయాడు