17, జులై 2008, గురువారం

అందమైన పిచుక

 

ఓ సాయంకాలం, మా ఇంటికి నడుస్తూ వస్తున్నాను.

మా వీధి చాలాబాగుంటుంది. పెద్ద పెద్ద చెట్లు , పచ్చికతో చాలా అందంగా ఉంటుంది.

వీధి చివర నుంచి మా ఇల్లు కనుచూపుమేరలో ఉంది.

పెద్ద గాలి వీస్తోంది . అంతా నిర్మానుష్యంగా ఉంది.వర్షం పడుతుందేమో అని అందరూ లోపలికి వెళ్ళినట్టున్నారు.

******************************************************************

అక్కడ ఉన్న ఓ చెట్టు మీద ఓ పిచుక కనిపించింది , నాకు చిన్న పక్షి ఏది కనిపించినా పిచుక అనే అంటాను.

అది అటు ఇటు ఎగురుతూ దిక్కులు చూస్తోంది . అది చాలా అందంగా ఉంది.

దాని ఒంటి మీద రంగులు చాలా ఉన్నాయి. చిన్న ఇంద్రధనస్సు చెట్టు మీద ఉన్నట్టుంది.

నాకు దాని ఒంటి మీద ఎరుపు, ఆకుపచ్చ,నీలం రంగు కనబడుతున్నాయి.

అది దాని తల్లి కోసం వెతుకుతున్నట్టుంది. గాలి మరీ పెద్దదిగా ఉండటం వలన అది ఎగరలేకపోతోంది.

అది నన్నే చూస్తోంది. పాపం దానికి నా భాష రాదు, నాకు దాని భాష రాదు.

మొదటి సారి నాకు పక్షి భాష కూడా వస్తే బాగుంటుంది అనిపించింది.

ఒక వేళ దానికి మన భాష తెలిస్తే 'మా అమ్మని ఎక్కడైనా చూసావా?' అని అడిగేదేమో.

మా ఇంటి దగ్గరకు వచ్చాను కాని ఆ పిచుక నన్నే చూస్తోంది.

కాసేపు నేను కూడా దాని తల్లి కోసం ఆకాశం వైపు చూసాను. ఎక్కడా ఏ పిచుక ఇంకొకటి లేదు.

నేను దాని వైపు చూసాను అది ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీదకు ఎగిరింది .

నేను ముందుకు నడిచే కొద్దీ అది నా వైపు రాసాగింది.

అది దాని తల్లితో కలిసి వెళ్తుందనే ఉద్దేశంతో నేను దానికి టాటా చెప్పి ఇంట్లోకి వెళ్ళిపొయాను.

****************************************************************

రాత్రి భోజనం చేసిన తరువాత బయట వాతావరణం ఎలా ఉందా అని తలుపు తీసాను,

ఓ సారి బయటకు వచ్చాను. 

ఆ పిచుక అక్కడ ఉన్న గడ్డిలో ఏదో తింటోంది.

ఆకలి వేసిందనుకుంటా దానికి , దేన్నైనా భరించచ్చుకాని ఆకలిని మాత్రం తట్టుకోలేం.

నేను కొన్ని గింజలు వేసాను దానికి.

ముందు నన్ను చూసి భయపడింది .

ఎందుకు భయపడదు మనుషులం కదా. కాని కాసేపటికి వచ్చి ఆ గింజలు తింటం మొదలుపెట్టింది .

రాత్రి మా ఇంటి మెట్ల దగ్గర ఓ చిన్న గూడు లాంటి ప్రదేశంలో పడుకుంది.

***************************************************************

ఉదయం ఫలహారాలు ఐన తరువాత ఓ సారి అది ఉందా లేదా అని చూసా , అది ఇంకా అక్కడే ఉంది.

దానికి కొన్ని గింజలు వేసా. దాన్ని పెంచుకోవాలి అనిపించింది ,కాని అది దాని తల్లి దగ్గరకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో

నేను వెళ్ళిపోయాను.

దాని భాష నాకు తెలిస్తే దాని కుటుంబాన్ని మొత్తాన్ని రమ్మనేవాడిని.

అది దాని తల్లిని చేరాలని ఆశించాను , మళ్ళీ వచ్చేటప్పడికి అది అక్కడే ఉంటే ఈసారి వదులుకోదలచుకోలేదు, పెంచుకోవాలి అనుకున్నాను.

సాయంత్రం ఇంటికి వచ్చి అది అక్కడే ఉందా లేదా అని చూసాను , కాని అది కనిపించలేదు.

ఎందుకో బాధ కలిగింది . దాన్ని నాతోనే పెంచుకుంటే బాగుండేది అనిపించింది.  

కాని ఇప్పటికీ పిచుకలు ఏవి కనిపించినా వాటిలో ఆ పిచుక ఉంటుందనే భావిస్తాను .

డాబా మీద నుంచుని దాని కోసం రోజూ ఎదురు చూస్తాను.

అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఆ పిచుకను అనవర్సరంగా వదులుకున్నానేమో అని అనిపిస్తుంది.

ఇప్పటికీ నేను కోరుకునేది మాత్రం ఒక్కటే దానికి ఏ హాని జరగకూడదని .

9 కామెంట్‌లు:

ప్రపుల్ల చంద్ర చెప్పారు...

బాగా వ్రాశారు, నాకు రామ చిలుకతో ఇలాంటి అనుభవం ఉంది,

మీనాక్షి చెప్పారు...

ఓహో కొత్త పోస్ట్ రాసేసారా...
చాలా బాగుంది...

Unknown చెప్పారు...

చాలా సింపుల్ గా చాలా అందంగా కొన్ని కొన్ని వ్యాక్యాలు ఎక్కడో touch చేసినట్టు ఉంది, ఒక్క మాటలో చెప్పాలంటే "లేత" గా ఉంది ఈ టపా

Rajendra Devarapalli చెప్పారు...

ఆహా తొలకరి జల్లు గారు,మిమ్ముల్ని అయ్యా అనాలో,మేడం అనాలో తెలియదు గానీ,అసలే అర్భకపుదైన నా గుండెను బుల్డొజర్ కిందవేసి తొక్కించారు కదండీ.ఆ పిచుకే కాదులేండి అసలు పిచుకలే అంతరించిపోతున్నాయి.నాకు పిచుకల మీద పిచ్చ బెంగకాబట్టి పిచుకలు అని ఒక బ్లాగు కూడా ఆరంభించాను.ఇలాంటివి బాగా ...తక్కువగా రాయండి,ఎక్కువైతే తట్టుకోలేము..

cbrao చెప్పారు...

పక్షులపైన మీరు వ్యక్తపరిచిన ప్రేమ - మీరు హైదరాబాదు లో ఉంటే Birdwatchers Society of Andhra Pradesh లో సభ్యులుగా చేరవచ్చు. ప్రతి నెలా outing లో రక రకాల పక్షులు ఉండే ప్రదేశాలకు తీసుకు వెళ్తారు. పక్షుల గురించిన బొలేడు జ్ఞానం (Ornithology) నేర్చుకోవచ్చు. Conservation of nature గురించిన ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మరింత సమాచారానికై నాకు e-mail చెయ్యండి. Word verification తొలగించండి. ఇది పెద్ద న్యూసెన్సె.

అజ్ఞాత చెప్పారు...

క్లుప్తంగా, హత్తుకునేట్టు రాశారు. చాలా బాగుంది.

-- విహారి

Srinivas చెప్పారు...

ఆ పిచిక మీద మాకు కూడా బెంగ పుట్టించారు గద! చలం గిజిగాడు గుర్తొచ్చింది.

రాధిక చెప్పారు...

caalaa baagaa raasaaru.evaro cinnabaabu ceputunnaadanukunnaanu.

Srikanth చెప్పారు...

@ కొత్త పాళీ గారు, @ ప్రపుల్ల చంద్ర గారు,
@ meenakshi.a గారు,
@ అశ్విన్ బూదరాజ,@ రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు,
@ cbrao గారు, @ విహారి గారు,
@ Srinivas గారు, @ రాధిక గారు

ధన్యవాదాలు,
నెనర్లు