25, ఆగస్టు 2012, శనివారం

మరో అందమైన సూర్యోదయం




చుట్టూ ఎన్నో చెట్లు, పెద్ద పెద్ద కొండలు, వాటి మీదనుంచి దూకుతున్న జలపాతాలు, ఎన్నో కౄర మృగాలు, విష సర్పాలు, సాదు జంతువులు, పిట్టలు, పక్షులు, ఇలా అన్నింటితో కలిసిన ఒక దట్టమైన అడవి. రివ్వున గాలి, కౄర మృగాల అరుపులు, తోడుగా ఎతైన జలపాతం చేస్తున్న శబ్దం. అప్పటిదాకా పడుకున్న చెట్లను తట్టిలేపుతూ సూర్యుడు పైకి లేచాడు. ఆ ఎఱ్ఱటి సూర్య కిరణాల వెలుగుతో ఓ అందమైన ప్రేమకధ ఆ అడవిలో పుట్టింది.

అక్కడ అన్ని చెట్లూ పెద్ద పెద్ద కాండములతో, పొడుగ్గా, పచ్చటి ఆకులతో, ఆ అడవి అందానికి తామే కారణమన్నట్లు వయ్యారంగా ఆ సూర్యుని కాంతిలో ఒళ్ళు విరుచుకుంటూ ఉండగా, ఆ చెట్లు లేవగానే వాటి అందాలను తిలకించటానికి ఆ చెట్లపై గూడుకట్టుకున్న పక్షులు పైకి ఎగిరి మరీ ఆ అందాన్నిచూస్తున్నాయి. అంతటి అడవి అందానికి దాసోహమని చెప్తూ ఆ జలపాతాలు కూడా కొండనుంచి దూకుతూ వాటిని తడపాలని ప్రతిక్షణం ఆరాట పడుతూ ప్రవహిస్తున్నాయి.

ఇలా అన్ని చెట్లమద్యలో ఓ చిన్న చెట్టు అప్పుడే లేస్తూ ఒళ్ళు విరుచుకోగానే దాని ఒంటి మీదవున్న కొన్ని పూలు అలానేలను తాకాయి. ఆ తొలికాంతిలో ఓ అందమైన పక్షిని అలా చూసింది. అదేసమయంలో అంతటా పచ్చగా వున్న ఆ అద్భుత ప్రపంచంలో అందమైన పూలతో ఆకర్షణీయంగా ఉన్న ఆ చెట్టును చూసింది. ఇన్ని రోజులు ఎన్నో అందమైన పూలు పూసినా ఏరోజూ అది అందంగా అనుకోని ఆ చెట్టు ఆ పక్షిచూసిన ఒక్కచూపులోనే, ఆ ఒక్క క్షణంలోనే సిగ్గుతో ఆకులు అన్నీ మెల్లగా కిందకి వాలాయి. మెల్లగా తన అందాన్ని ఆ పువ్వులు వికసిస్తూ కప్పేసాయి. అలా మొదటి చూపులోనే ఆ రెండూ తెలియని ఓ అనుభుతిని ఆనందించాయి.

నెమ్మదిగా ఆ పక్షి అలా వచ్చి ఆ చెట్టుపై వాలింది. ఒక్కసారిగా ఆ చెట్టు పులకరించిపోయింది. ఇన్ని రోజులూ ఏ పక్షీ తన వద్ద గూడు కట్టుకోలేదు సరికదా ఏ పక్షి తనను చూసిందిలేదు. ఇన్ని రోజులూ అది వేచి చుసింది ఆ పక్షికోసమే.
అలా ఎగిరి అలసి వచ్చిన ఆ పక్షికి ప్రతి ఆకూ వూగుతూ సేదతీరుస్తున్నాయి. ఆ పక్షి కూడా ఆ చెట్టుమీద అటు ఇటు తిరుగుతూ నాట్యం చేస్తూ, తన మదురమైన స్వరంతో పాడుతూ ఆ చెట్టును ఆనందపరుస్తోంది. ఆ పువ్వులూ పరిమళాలు జల్లుతూ ఆహ్లాదపరుస్తున్నాయి.

అలా కొంతసేపు ఆ రెండూ ఒకరినొకరు సేదతీర్చుకుంటూ, ఆనందంగా ఆహ్లాదంగా గడిపిన తరువాత ఆ పక్షి ఆ చెట్టుమీద నుంచి వెళ్తూ గాల్లోకి ఎగిరి తిరిగి ఆ చెట్టుమీదకు వచ్చి తన ముక్కుతో ఆ చెట్టును పొడిచి వెళ్ళిపోయింది. చూసే ప్రతి ఒక్కరికి ఆ పక్షి చెట్టుకి గాయం చేసిందేమో అనిపిస్తుంది కాని నిజానికి ఆ పక్షి ఆ చెట్టుని ముద్దాడి వెళ్ళిపోయింది.

ఇలా ఆరెండిటి మద్య రోజు రోజుకి స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ప్రతిరోజు ఆ పక్షి ఆ చెట్టుమీదకి రావటం ఆ రెండూ కాసేపు ఆనందంగా గడపటం, వెళ్తూ వెళ్తూ తన ముక్కుతో ముద్దాడి వెళ్ళటం. ఈ రెండిటి ప్రేమ అక్కడ ప్రతి పక్షికీ ప్రతి చెట్టుకీ తెలుసు.

ఇలా ఆనందంగా చాలా రోజులు గడిచాయి. ఒకరోజు ఆ పక్షి ఆ చెట్టు దగ్గరకు రాలేకపోయింది. ప్రతి రోజు కచ్చితంగా తన దగ్గరకు వచ్చే ఆ పక్షి ఎంతసేపటికి రాకపొయేసరికి ఎందుకు రాలేదా అని ఆలోచిస్తూ తనకి ఏ హానీ జరగకూడదని కోరుకుంటూ వేచిచూస్తూ ఉంది. అటుగా వెళ్తున్న ప్రతి పక్షినీ తన రాకగురించి అడిగింది. కాని ఏవీ కూడా ఆ పక్షి ఎక్కడ వుందో, ఏమైందో చెప్పలేక పోయాయి. సాయంత్రంకావస్తున్నా ఆ పక్షి రాలేదు.

ఇంతలో ఎవరో తనని గొడ్డలితో కొడుతూవున్నరు. తనని చంపుతున్నారని ఆ చెట్టుకి అర్దమైంది. కాని చివరిసారి ఆ పక్షిని చూడాలని తనని తాకాలని,ఒక్కసారి ముద్దాడాలని అనిపించింది. అలా అనుకుంటుండగానే ఒక్కసారిగా నేలకొరిగిపోయింది. తన అందమైన పువ్వులూ ఆకూలూ ఏమీలేవు ఇక. తనని ముక్కలుగా కోసి తీసుకెళ్తున్నారు.
తనని తీసుకెళ్ళి మంటలో వేస్తారని ఆ చెట్టుకి తెలుసు. తను చివరిసారి కాలి బూడిదైపోయేలోపు ఆ పక్షిని ఒక్కసారి చూడాలనికోరుకుంది.

వేటగాడి వలనుంచి తప్పించుకొని వచ్చేసరికి ఆలస్యమైందని, ఆ విషయం చెప్పాలని వచ్చిన ఆ పక్షికి ఆ చెట్టు కనిపించలేదు. ఒక్కసారిగా అంతా వింతలోకంలా చూసింది. ఆ చెట్టుకి ఏదో ప్రమాదం జరిగిందని గ్రహించింది. దాన్ని ఒక్కసారి చూడాలని అటు ఇటు వెతికింది. పక్కన వున్న చాలా ఛెట్లు కనిపించలేదు. ఎవరో దాన్ని నరికి తిసుకువెళ్ళారని అర్దమైంది. దిక్కు తోచక ఆ చీకటిలో అటు ఇటూ తిరుగుతూనే వుంది. చివరికి ఓ పెద్ద మంట దూరంగా కనిపిస్తుంటే అటు వైపు వెళ్ళింది.

ఆ ప్రాంతంలో కొట్టిన చెట్లు చాలా వున్నాయి. తన దానికోసం అంతా వెతికింది ఎక్కడా కనిపించలేదు. తను పొడిచిన ప్రతి తీపిగాయం గుర్తూ ఆ పక్షికి ఙ్ఞాపకమే. చివరికి మంటలో కాలుతూ వున్న కట్టెను చూసింది. తను పెట్టిన ప్రతి ముద్దు గుర్తూ దాని మీద కనిపించాయి. ఎంతో ఆవేదనతో, బాధతో దానిని తాకాలని, ముద్దాడాలని ప్రయత్నిస్తూ తనుకూడా అదే మంటలో ఆ చెట్టుతో కలిసి ఆ అడవిలోనే సుర్యడిని మింగిన అసురుడిలా అస్తమించాయి.

మళ్ళీ సూర్యోదయంతో మరో ప్రేమ కధలా ఆ రెండూ ఆ అడవిలో ఉదయించేందుకు మళ్ళీ పుట్టాయి.

3 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

మనసు హాయిగొల్పింది చదువుతుంటే ప్రతిఉదయంలా!

..nagarjuna.. చెప్పారు...

మనసును తాకేలా అందంగా ఆహ్లాదకరంగా రాయడంలో మీరు సిద్దహస్తులు శ్రీకాంత్ గారూ.

AB చెప్పారు...

Its really Good, I missed