17, అక్టోబర్ 2010, ఆదివారం

నేస్తమారోజూలాగే యధావిధిగా ఆఫీసుకి వెళ్ళాడు.
అడుగు పెట్టగానే ఏదో తెలియని నీరసం, నిస్సహాయత.
జీవితంలో ఏదో కోల్పోతున్నాను అన్న భావన. ఎప్పటిలాగే అతని కంప్యూటర్ తో  పనిలో వున్నాడు. ఇంతలో ఫోన్ రింగ్ అయింది.
ఆ నంబరు చూడగానే ఆ కళ్ళలో ఏదో తెలియని కాంతి కనిపించింది
"రాముడూ ఎలా ఉన్నావ్? ఏమి చేస్తున్నావ్?"
ఆ మాట్లాడుతున్న పెదాలపై చిరునవ్వు కనిపించింది.
ఎంతైనా అతని కాలేజీ స్నేహితుడు, అదీ చాలా రోజుల తరువాత ఫోను చేసాడు
ఆ కళ్ళలో ఉన్న ఆనందంకాస్తా ఆశ్చర్యంగా మారసాగింది.
"నిజం చెప్పరా! ఎవరి గురించి మాట్లాడుతున్నవ్?"
"అసలు ఎవరికి ఫోను చేయబోయి ఎవరికి చేసావ్?"
ఆ కళ్ళలో ఆశ్చర్యంకాస్తా బాధగా మారింది.
"రేయ్! నిజం చెప్పరా హాస్యాలాడటం లేదుగా నాతో"
ఎన్నో భావోద్వేగాలు కనిపించాయి ఆ మొహంలో
"సరేరా నేను వెంటనే బయలుదేరుతాను"
వెళ్ళి అతని టీం లీడుతో ఏదో మాట్లాడాడు
తరువాత అక్కడ నుంచి గబగబా బయటకి వెళ్ళిపోయాడు.
******************************************************
"సార్ విజయవాడ సూపర్ ఫాస్టు ఒరు టికెట్"
రెండు సంవత్సరాలు అయింది అతడు విజయవాడ వెళ్ళి.
పరిగెత్తుతూ ఎలాగొలా కదులుతున్న రైలును పట్టుకున్నాడు.
ఎక్కడా చోటు లేదు దానితో కర్చీఫ్ వేసి తలుపు దగ్గర కూర్చున్నాడు.
తన రెండు కాళ్ళు ఆ రైలు పెట్టి మెట్లపై పెట్టి అటుగా కదులుతూ వెళ్తున్న ప్రపంచాన్ని చూస్తూ పాత ఙ్ఞాపకాలలోకి వెళ్ళిపోయాడు
ఇంతలో ఫోను రింగు అవటంతో మళ్ళీ ఈలోకంలోకి వచ్చాడు.
"చెప్పరా"
"అవునురా నిజమే"
"ఎలా జరిగిందో తెలియదు"
"ఇప్పుడే బయలుదేరా"
"సరే ఐతే"
*****************************************************
నాలుగు సంవత్సరాలు అందరూ కలిసి ఉన్నారు. కాని ఆ తరువాత ఎవరితోనూ సరిగా టచ్ లో లేడు.చాలా రోజుల తరువాత ఒక ఫోను వచ్చింది అదికూడా
'రమేష్ చనిపొయాడు అని '
ఇన్నిరోజులూ కలిసే అవకాశం ఉన్నా వాడు కలవలేదు , ఇక కలవాలనుకున్నా కలిసే వీలులేదు.
స్నేహితులు అందరూ కలుద్దాము అని చాలాసార్లు అనుకున్నారు, కాని ఇలా కలుస్తారు అని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇది ఎలా జరిగింది, ఇప్పటిదాకా అతడికి తెలియదు.
ఆఖరిసారి వాడి  దేహాన్ని చూడటానికి బయలుదేరాడు.
విజయవాడలో దిగేటప్పటికి రాత్రి పది గంటల సమయం అవుతోంది.
********************************************************
ఆ సమయంలో కూడా దిగే జనాలతో ప్లాట్ఫారం గందర గోళంగా ఉంది.రాముడు ప్లాట్ఫారం మీద ఉంటానన్నాడు .అటూ ఇటూ చూసాడు,
ఎక్కడా కనిపించలేదు
 'ఎక్కడ ఉన్నావు ?'  ఫోన్ చేసి అడిగాడు
'ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు '
వెనక్కి తిరిగి చూసాడు ఆ జనం లో అంత సులభంగా కనిపించరు, ఐనా చాల రోజులైంది వాడు  రాముడిని చూసి గుర్తుపట్టడం కుడా  కష్టమే.
 ఆ జనం లో సన్నగా ఉన్న వ్యక్తి వాడినే చూడ సాగాడు .
'ఎలా ఉన్నావు '
 'నేను బానే ఉన్నాను రా'
చాల రోజుల తర్వాత రాముడిని చూసాడు, ఆ కళ్ళలో ఏదో తెలియని ఆనందం కనిపించింది ఆ క్షణంలో
అంతకు మించి ఇంక ఏమీ అడగ లేక పోయాడు ఆ ఆనందంలో
మళ్లీ రమేష్ గాడు గుర్తు రావటంతో ఆ కళ్ళలోకి మళ్లీ బాధ చేరింది
'అసలు ఏమి జరిగిందిరా ?'
పక్కనే ఉన్న బల్ల మీద ఇద్దరూ కూర్చున్నారు
వాడు రాముడిని ని అడిగిన రెండో మాట ఇది
'ఆత్మ హత్య చేసుకున్నాడు రా'
**********************************************
కనురెప్పల అంచు దాక కన్నీరు ఒక్కసారిగా చేరింది.
వెంటనే ఆ కళ్ళలో ఆశ్చర్యం కనిపించింది.
'వాడు ఆత్మహత్య చేసుకోవటం ఏమిటిరా ?'
ఆశ్చర్యం గా అడిగాడు రాముడిని
'ఫ్యాన్ కి వురి వేసుకొని చనిపోయడురా'
కాలేజీలో చదువుకునే రోజులలో రమేష్ చాలా ధైర్యంగా ఉండేవాడు . అందరు వాడిని చూసి జీవితంలో తప్పకుండా ఏదో ఒకటి సాదిస్తాడు అనుకునే  వారు  .
'ఛా! అదేమిటిరా వాడు ఆత్మహత్య చేసుకోవటం ?'
'నాకు తెలిసి ఓ అరగంట నరకయాతన అనుభవించి ఉంటాడురా!,
ఎక్కడ తన చేతితో తనే ఆపుకుంటాడో అని తన చేతులను వెనక్కి మడిచి తాడుతో కుడా కట్టుకున్నాడు. మెడ దగ్గర చర్మమంత ఊడిపోయి దారుణంగా తయారైంది.'
ఇది వినంగానే ఒక్కసారిగా వాడికి ఏమి మాట్లాడాలో అర్ధంకాలేదు.
అంతా ఒక్క క్షణం నిశబ్ధం. చాలా సేపటి తరువాత మళ్లీ రాముడే మాట్లాడాడు
'వాడు ఎంతగా ముందే నిశ్చయించుకున్నడో  లేక పొతే ఇంత ఘోరంగా చేయడు'
కాలేజీ అయిపోయిన తరువాత కొన్నిరోజులు ఉద్యోగ ప్రయత్నం చేసి, ఆ తరువాత మాస్టర్ డిగ్రీ కోసం యునివర్సిటీ లో చేరాడు. 'అసలు అలా చేస్తాడు అని నేను ఎప్పుడూ అనుకోలేదు '
'ఎవరికీ తెలియదురా, రోజులానే అంతా మాములుగా సాగింది, ఇలా .......................అనుకోలేదు'
'ఇప్పుడు కాలేజీ లో పరీక్షలు కూడా జరుగుతున్నాయి. వాడు ఇంట్లో వాళ్ళకి సెలవులు అని చెప్పాడు .'
'రెండు రోజులు అందరిని కలిసాడు కొంతమందికి ఫోన్ చేసాడు ఇదంతా ఎందుకు చేసాడో ఇప్పుడు తెలుస్తోంది '
ఇది విన్నాక వాడి ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది
'అసలు ఆత్మహత్య చేసుకునే కష్టాలు ఏమున్నాయి రా వాడికి ?
అసలెందుకు చేసాడు ఎలా'
'నాకు తెలిసినంత వరకు కాలేజీ లో ఒత్తిడి తట్టుకోలేకపోయాడు ఈ సారి పరీక్షలు  కూడా సరిగా రాయలేననుకున్నాడు ,ఒక్కసారిగా మానసిక ఒత్తిడి కి లోనయి ఇలా చేసాడు '.
రాముడు చెప్పిన మాటలకు వాడు ఒక చిన్న శబ్దం రాని నవ్వు నవ్వాడు .
అది ఆనందం తో వచ్చిన నావు కాదు గుండెలోని బాధని కప్పి పుచటానికి వచ్చిన నవ్వు .
ఐనా రమేష్ ని వాళ్ళ ఇంట్లో ఏమి అనరు, మాస్టర్ డిగ్రీ కూడా వాడు ఇష్టపడే చేరాడు ఇంట్లో వాళ్ళు పర్లేదు అని చెప్పినా కూడా .
వాడిని ఎంతో గారాబం గా చూసుకుంటారు , ఐనా ఎందుకిలా చేసాడో వాడికర్థం కాలేదు .
ఇది అందరికి తెలిసిన కారణం , కానీ ఆ మనసుకి బాధ కలింగించిన సంఘటనలు ,కారణాలు ఇంకెన్ని ఉన్నాయో ,అది అనుభవించిన మనసుకే తెలుసు .'ఇంకాసేపటిలో మన కాలేజీ స్నేహితులు ఇంకొంతమంది వస్తున్నారు రా పది నిమిషాలలో ఆ రైలు కూడా వస్తుంది అందరం కలిసి ఒకేసారి వెళ్దాం '.
************************************************************************

'అశ్విన్ వస్తున్నాడా ?'
'చాలా రోజులైంది  వాడిని చూసి'.
ఎప్పుడో సంవత్సరం క్రితం అశ్విన్ ని చూసాడు  మళ్లీ ఇప్పుడే .
'మమ్మల్ని కలవకపోతే పర్లేదు అశ్విన్ ని కూడా ఎందుకు రా కలవటం లేదు '
రాముడడిగిన  ప్రశ్న  కి ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు వాడికి. తప్పు తనదే అని తెలుసు అందుకే ఆ ప్రశ్న నుంచి వెంటనే తప్పించుకోటానికి మాట మారుస్తూ 'రైలు ఇంకెంత సేపటిలో వస్తుంది ?'
'ఈపాటికి రావాలి'.
అలా వాళ్ళ సంభాషణ లు సాగుతున్నాయి .కానీ వాడి మనసులో మాత్రం అశ్విన్ జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయి . ఎప్పుడు  వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు.

**********************************************************************
చుస్తుండగానే రైలు రానే వచ్చింది. దూరం నుంచి పాత స్నేహితులు అందరూ కనిపిస్తున్నారు వాడికి , వాళ్ళలో తన ప్రాణ స్నేహితుడి కోసం ఆ కళ్ళు వెతికాయి.
'బానే లావైనాడు ' తనలో తను అనుకున్నాడు అశ్విన్ ని చూస్తూ. స్నేహితులందరినీ పలకరిస్తూ వున్నాడు ఒక్క అశ్విన్ ని తప్ప. అందరి కంటే ఆఖరిన అశ్విన్ ని పలకరించాడు. ఒక్క నిమిషం వాడు అశ్విన్ ని అలా చూసాడు .
ఏదో తెలియని ఆనందం . ఇప్పటివరకూ వున్న తన బాధను అంతా ఒక్క సారిగా , ఒక్క క్షణం అలా మరిచిపోయాడు.
తనని చూడగానే ఆ పెదాలపై ఓ చిరుదరహాసం .
'ఎలా వున్నావ్ రా?'
ఇద్దరూ ఒకేసారి అడిగారు
'బానే వున్నారు రా'
మళ్లీ ఇద్దరూ ఒకేసారి. ముందు జరిగిందంతా మనోడు అశ్విన్ కి పూసగుచ్చినట్లు వివరించాడు.
అలా మాట్లాడుతూ ఇద్దరూ స్టేషన్ బయటకి వచ్చారు.
సంవత్సరం తరువాత కలిసిన స్నేహితులు అంతా ఇదే మాట్లాడుకుంటున్నారు, ఎవరినీ పట్టించుకోకుండా.
'ఒకే సారి తినేసి వెళ్దామా '
వీళ్ళ మాటలకు కళ్ళెం వేస్తూ రాముడు అడిగాడు.
రమేష్ ది విజయవాడ పక్కన వున్న ఉయ్యూరు అనే చిన్న ఊరు. ఇప్పుడు అందరూ అక్కడకి వెళ్ళాలి.
*******************************************************************************
అందరూ అక్కడ నుంచి బస్సు స్టాప్ కి వెళ్లారు.అక్కడే అందరూ ఫలహారం చేసి ఉయ్యూరు వెళ్ళే బస్సు కోసం చూస్తున్నారు .
అప్పటికే బాగా ఆలస్యమైంది బస్సు వుందో లేదో అని చూస్తున్నారు . ఇంతలో బస్సు రానే వచ్చింది. అందరూ  ఎక్కి కూర్చున్నారు.
బస్సు కదలగానే నిద్రపోయిన వాళ్ళు కొంత మంది , కిటికిలోంచి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వాళ్ళు, రమేష్ గురించి చర్చించుకుంటున్న వాళ్ళు , ఇలా ఒక్కొక్కరూ ఒకొక్కటి చేస్తున్నారు . మళ్లీ వాడు,అశ్విన్ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, ప్రపంచాన్ని పట్టించుకోకుండా.
రాత్రి ఒంటిగంట సమయం లో ఉయ్యూరు చేరారు.
దిగగానే ఒక్కసారిగా అందరూ నిశబ్దమైపోయారు .
ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆలోచిస్తోంది రమేష్ గురించి మాత్రమే, ఎందుకు ఇలా చేసాడు అని.
బస్సు ఆగిన దగ్గర నుంచి రమేష్ వాళ్ళ ఇంటికి రెండు నిముషాలు పడుతుంది .
అందరూ నడుస్తున్నారు. ఈ రెండు నిమిషాలలో ఏవేవో ఆలోచనలు వాడి బుర్ర లో మెదిలాయి .
అసలు ఇది నిజమేనా , మన రమేషేనా, యెందుకిలా చేసాడు , యెంత బాధ పడుంటాడో , వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా వున్నారో ?............................
ఇలా ఎన్నో ఆలోచిస్తున్నాడు.
రమేష్ వాళ్ళ ఇళ్ళు చేరారు అందరూ. అప్పటిదాకా ఏవేవో ఆలోచించిన వాడి బుర్రలో ఒక్కసారిగా ఆ ఆలోచనలు స్తంభించి పోయాయి.
*********************************************************
గుమ్మం దగ్గర వున్నాడు , అక్కడ నుంచి ఒక పెద్ద పెట్టె కనిపిస్తోంది , అందులో రమేష్ ఉన్నాడని తెలుస్తోంది. ఒకొక్క అడుగు ముందుకు వేస్తున్నాడు , ప్రతి అడుగుతో గుండె చప్పుడు వేగం పెరుగుతోంది . ఇంకొక్క అడుగు వేస్తే రమేష్ ని చూడొచ్చు. కానీ ఆ అడుగు ముందుకు పడనంటోంది.
రమేష్ వాళ్ళ నాన్న వాడి కాళ్ళ దగ్గర కూర్చున్నారు , వాళ్ళ అమ్మ తలదగ్గర ఉంది. ఇది చూడగానే వాడికి శాస్వతం గా తల్లి ఒడిలో నిద్రిస్తున్న పసివాడు , ఆ పసివాడి కాళ్ళు పడుతున్న తండ్రి కనిపించారు .
అంతా నిశబ్దంగా వున్నా ఏదో అలజడి మనసులో వుంది , ఎవ్వరూ ఏడవక పోయిన ఏదో శబ్దం చెవులకు వినిపిస్తోంది
ఆ ఆఖరి అడుగు కళ్ళు మూసుకొని ముందుకు పడింది. అప్పటి వరకూ వాడు ఏవేవి విన్నాడో అది ఒక్కసారిగా వాడి కాళ్ళ ముందు కనిపించింది .
'రేయ్ రమేష్ నేనోచ్చాను రా ' అని ఒక్కసారి చెప్పాలని వుంది వాడి మనసులో .
అందరూ వాడిని ఆ రెండు సంవత్సరాలలో ఎప్పుడో ఒకసారి కలిసారు, కానీ వాడు మాత్రం కలవలేదు .
'రేయ్ నేనోచ్చాను ఒక్కసారి లేవరా ' అని చెప్పాలని వుంది వాడికి.
అందరూ చనిపోతూ జ్ఞాపకాలు విదిచిపోతారు కాని రమేష్ ఆ జ్ఞాపకాలు కుడా తీసుకెళ్తున్నడేమో అనిపించింది వాడికి.
మళ్లీ ఎప్పుడైనా రమేష్ గుర్తుకు వస్తే ముందు వాడు చనిపోయాడు అని గుర్తుకొస్తుంది తప్ప వేరేవి గుర్తుకురావుగా మరి.

రమేష్ ని అలా ఎక్కువసేపు చూడలేక పోయాడు , అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు . ఎందుకో వాడు ఆఖరికి అశ్విన్ ని కూడా చూడలేకపోయాడు. కాసేపటికి అశ్విన్ కూడా బయటకి వచ్చాడు.
'ఎందుకు రా ఇలా చేసాడు'
'ఏమీ అర్ధం కావటం లేదురా'
'అమ్మ వాళ్ళని చుస్తే మరీ బాధగా వుందిరా '
స్నేహితులు వుండేది బాధని పంచుకోవటానికి అంటారు , ఎవరికి చెప్పలేనివి ప్రాణ స్నేహితుడికి చెప్పుకుంటారు అంటారు , కానీ రమేష్ ఎందుకు ఇలా చేసాడో
ఒక్క క్షణం రమేష్ మీద వాడికి కోపం వచ్చింది , మళ్లీ బాధ ఆ కోపాన్ని మింగేసింది .
చాలాసేపు వాళ్ళిద్దరూ అలా రమేష్ గురించి మాట్లాడుకున్నారు.
***************************************************************************
రమేష్ వాళ్ళ ఇంటి పక్కన వేరే చోట పడుకోవటానికి వీళ్ళకు ఏర్పాట్లు చేసారు.అందరూ మేడ మీద చాపల మీద పడుకున్నారు.
రమేష్ విషయాన్ని మరచిపోతూ అందరూ తమ కాలేజీ రోజుల గురించి మాట్లాడుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు.
ఆ కనురెప్పల వెనుక నుంచి వాడి కళ్ళు రమేష్ గురించే ఆలోచిస్తున్నాయి.
కాలేజీ స్నేహితులు అందరూ కలిసినందుకు ఆనందించాలో లేక ఇలా కలిసినందుకు బాధపడాలో అర్ధంకాలేదు
అందరూ అదే ఆలోచనతో నిద్రపోయారు.
************************************************************************
ఇంకా సూర్యుడు కూడా రాలేదు . ఆ తొలి కాంతిని తమ స్నేహితుడి తో ఆఖరిసారి చూడాలని అందరూ తెల్లవారిఝామునే నిద్రలేచారు ,
కలకృత్యాలు  తీర్చుకున్నారు , అలా అందరూ ఆఖరిసారి రమేష్ ని చూడటానికి అక్కడికి వెళ్లారు. ఏడుగంటలకు దహన కాండ.దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి . అశ్విన్ తో కలిసి వాడు ఓ పక్కగా కూర్చుని రమేష్ నే చూస్తున్నాడు . పాడె సిద్దం చేస్తున్నారు. ఎందుకో అంతా నిశబ్దంగా ఉంది, చుట్టూ అలజడిగా వున్నా. రమేష్ శరీరానికి ఆఖరి సారి స్నానం చేయిస్తున్నారు.అప్పటిదాకా ఉన్న బాధ మళ్లీ ఇంకోసారి కట్టలు తెంచుకుంది .
అప్పుడే వణుకుతున్న గొంతుతో మాటలు వినిపించాయి
'ఆ కొత్త బట్టలు తాండిరా , ఆ రంగు వాడికి ఎంతో ఇష్టం '
'మేము ఏమి తప్పుచేసమనమ్మ మాకీ కష్టం '
'ఒక్క సరి లేవరా ........'
అప్పటిదాకా నిశబ్ధంగా వున్నా వాడి మనసులో మళ్లీ అలజడి మొదలైంది .
కనురెప్పల అంచుదాకా కన్నీళ్ళు చేరాయి.
అక్కడ వున్న ప్రతి ఒక్కరూ ఏడుస్తూనే వున్నారు.

అందరూ ఒక్కొక్కరిగా వచ్చి పూలు జల్లి ఆశీర్వదిస్తున్నారు  అనాలో లేక ఆశీర్వాదం తీసుకుంటున్నారు అనాలో తెలియటంలేదు .
'రండి బాబు వాడు బతికినన్నాళ్ళు స్నేహితుల కోసమే బతికాడు........................రండి బాబు .............'
ఆ మాటలు ఎందుకో వాడి గుండెకు గుచ్చుకున్నాయి. ఆ క్షణం స్నేహితులందరూ ఉన్నా చచ్చిన వాళ్ళతో సమానంగా అనిపించింది.
వణుకుతున్న చేతితో అలా పూలు జల్లి , ఆ కన్నీరు ఎవరైనా చూస్తారేమో అని ఆ నీటిని కళ్ళతోనే మింగేసి అక్కడ నుంచి బయటకు వచ్చాడు.
ఇక ఆ తల్లిదండ్రుల బాధ చెప్పనవసరం లేదు. ఆఖరి సారి తన మిత్రుడిని చూసి ఏడుస్తున్న స్నేహితులు. అతడిని అలా చూడలేక సృహకోల్పోయిన సహోదరులు, ఇంక ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఆ కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి, ఎక్కడ సృహ కోల్పోతే తన కుమారుడిని చూసే ఆ ఆఖరి క్షణం కోల్పోతామో అని అలా చూస్తూ రోదిస్తూ ఉన్నరు.
కాసేపు బయటే మౌనంగా వున్నాడు . అశ్విన్ కూడా వాడి దగ్గరకు వచ్చాడు.
ఇంక అంతా ఐపోయింది . మళ్లీ వాస్తవం లోకి రావాలి అని వాడు వాడి మనసుకు సర్దిచెప్పుకుంటున్నాడు. కొద్దిసేపటికే రమేష్ ని మోసుకుంటూ బయటకువచ్చారు. అలా పూలు జల్లుకుంటూ డప్పుల దరువుతో సాగనంపుతున్నారు. వాడు అలా చూస్తూ ఉండి పోయాడు. కనుచూపు మేరలో రమేష్ కనిపించనంత వరకు కనురెప్ప పడలేదు. ఆ కాలే కట్టెను చూసే ధర్యం వాడికి లేదు. అక్కడ దాకా వెళ్ళే అర్హత కూడా లేదనిపించింది వాడి గుండెకు.
*****************************************************************************
స్నేహితులందరూ నెమ్మదిగా నడుచుకుంటూ బస్సు స్టాప్ దగ్గరకు వెళ్లారు. అప్పటి దాకా దిగమింగుకున్న బాధను ఒక్కసారిగా ఒకొక్కళ్ళు బయటకు ఏడుస్తూ వెళ్లగక్కారు.
కాసేపటికి బస్సు వచ్చింది . అందరూ విజయవాడ బయలుదేరారు. రాముడు, అశ్విన్  వాడితో కలిసి కృష్ణా నదిలో స్నానం చేసారు. అక్కడ నుంచి వాళ్ళు రాముడు వాళ్ళ ఇంటికి వెళ్లారు .
ఆ బాధ ని మర్చి పోవటానికి, మళ్లీ కాలేజీ రోజులు గుర్తుచేసుకుంటూ బిందాస్ గా ఒక సినిమాకి వెళ్లారు . ఆ రోజు అంతా కాలేజీ రోజుల్లో లాగా గడిపారు .
ఇప్పటికీ ఎంత మంది చెప్పినా ఇది నిజం - 'మనిషికి దేవుడిచ్చిన గొప్పవరం మర్చిపోవటం '
**************************************************************************
సాయంత్రమైంది, బస్సు బయలుదేరే సమయమైంది. ఎందుకో వాడి గుండెలో చిన్న బాధ మొదలైంది.
అశ్విన్, రాముడు ఇద్దరూ వాడిని బస్సు ఎక్కించటానికి వచ్చారు. ఇద్దరూ మాట్లాడుతూనే వున్నారు, కాని వాడు మాత్రం నిశబ్దంగా వున్నాడు. ఇంకొన్ని క్షణాలలో మళ్లీ అశ్విన్ ని విడిపోతాడు అని కాబోలు . బస్సు బయలుదేరే సమయమైంది .
'సరేరా , ఇంక వుంటా, నువ్వు జాగ్రత్త ' అని చెప్పి బస్సులో కూర్చున్నాడు.
చుట్టూ బస్సెక్కిన వాళ్ళు వున్నారు, ఇంకా బస్సు లో లైట్లు వెలుగుతూనే వున్నాయి .
అప్పటిదాకా కనురెప్పల మాటున వున్న కన్నీరు , ఒక్కసారిగా ఆ చెంపలను తాకుతూ కిందికి జారింది.
తన ఫోన్ లో నుంచి ఒక చిన్న సందేశం పంపించాడు అశ్విన్ కి -
' ఎందుకో ఈ కన్నీరు ఆగటం లేదురా , అందుకే నేను తొందరగా ఎవరిని కలవను, విడిపోతే చాల బాధగా వుంటుందని'
ఎప్పుడో సంవత్సరం క్రితం వాడి కళ్ళలో నుంచి కన్నీళ్ళు జారాయి , మళ్లీ ఇప్పుడు. రెండు సార్లు తన ప్రాణ స్నేహితుడిని విడిపోయేటప్పుడే.
ఎంత ప్రయత్నించినా వాడి కన్నీరు ఆగలేదు . చుట్టూ వున్న వాళ్ళు చూస్తున్న అలాగే ఆగకుండా వస్తున్నాయి.
జరిగిందంతా తలచుకుంటూ కళ్ళుమూసుకొని నిద్రలోకి జారుకున్నాడు.

మరుసటి రోజు మళ్లీ మొదలు, యధావిధిగా మళ్లీ ఆఫీసు కి వెళ్ళాడు , తన పనిలో తను మునిగి పోయాడు.

ఇప్పటికీ ఎంతమంది చెప్పినా , ఎన్ని సార్లు చెప్పినా ఇది నిజం-
'మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం  మర్చిపోవటం '

నాలుగు సంవత్సరాల తరువాత 'రేయ్ గుర్తుందా మన రమేష్ గాడు..............................'
ఎందుకో వాడి గొంతు ఒక్కసారిగా మూగబోయింది
కాలమే అన్నిటినీ మరచిపోయేలా చేస్తుంది అంటారు , కానీ ఆ కాలమే ఒక్కోసారి గడిచిన గతాన్ని కూడా గుర్తుచేస్తుంది

9 కామెంట్‌లు:

సంతోష్ చెప్పారు...

very interesting..
Baaga raasaru..
Keep going..

చెప్పాలంటే...... చెప్పారు...

కాలమే అన్నిటినీ మరచిపోయేలా చేస్తుంది అంటారు , కానీ ఆ కాలమే ఒక్కోసారి గడిచిన గతాన్ని కూడా గుర్తుచేస్తుంది chalaa nijam edi. baagaaa raasaaru..

Unknown చెప్పారు...

aswin gaari blogs lo unde srikanth,ii srikanth okate ante assalu nammalekapothunnanu. Entha hrudyangaa untaay mi blogs anni.
Nijame kaaalam annintini maripinchesthundi. evaro annatto, gnapakaalanni madhilo untay,maruguna padathay, kaani edo oka sandarbam, edo oka sanghatana malli annintini gurthuchesi gundeni baruvekkisthundi

..nagarjuna.. చెప్పారు...

i just don't have words to appreciate your narration....కొన్నిచోట్ల కళ్లలో నీళ్లు తిరిగాయి....బాగా రాసారు అశ్విన్


>>వాడు రమేష్ ని అడిగిన రెండో మాట ఇది

అక్కడ ఉండాల్సింది 'రాముడిని' కదా...

..nagarjuna.. చెప్పారు...

క్షమించాలి శ్రీకాంత్ గారు...తొందరలో అనుకోకుండా అశ్విన్‌గారి పేరు రాసేసాను...కోప్పడకండి

manasa vadarevu చెప్పారు...

chala bagundi

srikanth చెప్పారు...

ధన్యవాదములు ..nagarjuna.. గారు
ఆ తప్పుని సరిచేసాను,
అయ్యో నేనెందుకు కోప్పడతానండి :)

Vyasa Virachitam చెప్పారు...

కదిలి పోయిన కాలంలో ...చెదిరిపోయిన కలలు..అవి కల్లలు అయితె ఎంత బాగుండేదో కదా..
@ Sri..good one...

అజ్ఞాత చెప్పారు...

Aswin ki mosam thappa pellam, pillalu, friendship lu alanti emotions undavu... waste of time in wrinting about him ... inkosari alanti yedavalni ilanti manchi emotions ki vadoddu ...