5, జూన్ 2012, మంగళవారం

ఆఖరి మొదటి పలుకు     అంతా చీకటి, నిశబ్దం, ప్రశాంతత. ఏదో లోకం, ఏదో ఆనందం, ఎప్పుడూ అక్కడే ఉండాలనిపించే ప్రదేశం. ఇంతలో ఒక్కసారిగా అలజడి, ఒక్కసారిగా ఇప్పటిదాకా ఉన్న ప్రశాంతతంతా మటుమాయం. మరోకొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టుగా ఉంది. అంతా నిశబ్దంగానే ఉంది కాని తెలియని ఏదో భయం, బాధ, మనసులో ఏదో తెలియని అలజడి నెమ్మదిగా ఆవహిస్తున్నాయి. కొంచం కొంచంగా శబ్దం పెరుగుతోంది.

******************************************************************************

     అప్పటివరకూ నిదురిస్తున్న ఆ రెప్పలు మెల్లగా తెరుచుకుంటున్నాయి. శబ్దంచేస్తూ తిరుగుతున్నది ఒకటి ఆ కళ్ళకు కనిపిస్తోంది. ఏదో కాంతి ఆ కళ్ళని పూర్తిగా తెరవనివ్వటంలేదు. ఇంకా ఆ చుట్టూవున్న లోకాన్ని చూడలేకపోతున్నాయి ఆ కళ్ళు. 

     చుట్టూ ఏదో తెలియని వాసన, తెలియని వస్తువులు, తెలియని మనుషులు. అంతా ఒకే రంగులావుంది. ఏదో తెలియని వింత లోకంలా అనిపిస్తోంది. ఎప్పుడూ చూసే వస్తువులువున్నా అంతా కొత్తలోకంలా ఉంది. నెమ్మదిగా మనసులో ఏదో తెలియని దిగులు, ఆవేదన మొదలైనాయి. 

     చేతికి పెట్టిన ఒక వింత వస్తువు ఆ చేతికి ఏదో తెలియని నొప్పిని కలిగిస్తోంది. నెమ్మదిగా తన పాత లోకంలోకి వెళ్ళటానికి ఆ కళ్ళు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. మళ్ళీ ఆ కళ్ళు నెమ్మదిగా ముసుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. కాని ఆ మనసు మాత్రం తనకి కావలసినదానికోసం వెతకమని చెబుతున్నది. మళ్ళీ తెరుచుకున్న ఆ కళ్ళు అటు ఇటు చూడసాగాయి. నెమ్మదిగా ఆ భయం పెరుగుతోంది. ఆ కొత్తలోకంలో ఆ కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయి. దేనిని చూస్తే ఏ భయం లేకుండా హాయిగా మనసు ఉంటుందో, దానికోసం ఆ కళ్ళు వెతుకుతున్నాయి.

******************************************************************************

గడియ గడియకి భయం ఎక్కువ అవుతున్నది. ఆ భయంకరమైన ప్రదేశం ఇంకా ఆ భయాన్ని పెంచుతోంది. ఆ తెలియని లోకంలో, ఆ కళ్ళు ఇంకా ఆ మనసు వెతికేదానికోసం చూస్తున్నాయి.

నెమ్మదిగా ఆ కళ్ళకు అన్నీ మసకగా కనిపిస్తున్నాయి, కన్నీళ్ళు నెమ్మదిగా బయటకు రాసాగాయి. ఆ మనసుకు తను ఒంటరి అని అనిపించిందేమో తెలియని దు:ఖంతో ఆ మనసు నిండిపోయింది. నెమ్మదిగా ఆ ప్రవాహం పెరుగుతోంది, ఆగని ఆ కన్నీటి ప్రవాహానికి తోడుగా అప్పటి వరకూ నిశబ్దంగా వున్న గొంతులోనుంచి ఓ శబ్దం బయటకు రాసాగింది.

తన ఒంటరి తన్నాన్నికనీసం ఆ గొంతులోని ఏడుపు పోగొడుతుందేమో అని. ఎంత ఏడ్చినా ఆ కళ్ళకు తను వెతుకుతున్న వ్యక్తి మాత్రం కనిపించలేదు. చుట్టూవున్నవాళ్ళు ఏవేవో చేస్తున్నారు కాని ఇంకా ఆ వ్యక్తి మాత్రం కనిపించలేదు.

ఇంతలో ఎవరో తనవైపు వస్తున్నట్టుగా అనిపించింది. చూడగానే ఆ మనసుకు తెలియని ఆనందం, ఆ వ్యక్తి పక్కనవుంటే చాలు తనకు ఏమీకాదు అన్న నమ్మకం, మళ్ళీ ఆ అందమైన లోకంచూసినట్టుగా అనిపించింది ఆ  వ్యక్తిని చూడగానే.

ఇప్పటిదాకా భయంకరంగావున్న ఆ ప్రదేశంకూడా ఎందుకో అందంగా కనిపిస్తోంది. నెమ్మదిగా ఆ ఏడుపు తనే ఆగిపోతోంది, కన్నీళ్ళూ అవే నెమ్మదిగా ఆగిపోసాగాయి. ఆ వ్యక్తి దగ్గరకు ఎప్పుడు వస్తుందా అని మనసు ఇంకా ఎదురు చూస్తూనేవుంది. ఆ ఆగిన గొంతులోనుంచి ఎక్కిళ్ళు రాసాగాయి. 

******************************************************************************

అమ్మ వచ్చి ఎత్తుకోని జోకొట్టగానే ఆ పసిపాప కళ్ళలోని నీళ్ళు, ఆ ఎక్కిళ్ళు అన్నీ ఆగిపోయాయి. ఎప్పుడూ అమ్మ చెప్పే ఆ మాటలు వింటుంటే ఆపాపకు ఎంతో తియ్యగా అనిపించింది. అలా అమ్మ చెబుతున్న మాటలు వింటూ ఏడుపు ఆపింది. 

తన కళ్ళలో వచ్చిన నీళ్ళే ఇప్పుడు అమ్మ కళ్ళలో కూడా కనిపించాయి ఆ పాపకు. దేన్నీ పట్టుకోవటానికి లేకుండా ఆ చేతులుదేనితోనో కట్టేసినట్టుగా అనిపించింది. అది చూడగానే మళ్ళి ఆ పాపకు భయమేసింది. మళ్ళి అమ్మవైపు చూసింది. తను పక్కనే వుంటే చాలు అన్నట్లు ఆ పాప తల్లిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తోంది. అమ్మ చేతులు తన తలని నిమురుతుండగా..........

'అమ్మా' అని ఆ పాప అమ్మని పిలిచింది. 
ఆ మాట ఆ పాప నోటినుంచి వచ్చిన మొదటి తియ్యటిమాట, ఆ తల్లి తన బిడ్డనుంచి విన్న ఆఖరి మొదటి పలుకు...

తను ఎందుకు ఈలోకంలోకి వచ్చిందో ఎందుకు విడిచి వెళుతోందో తెలియకుండానే ఆ పసిపాప ఆ తల్లి కన్నీటి బొట్టై జారి ఈ భూమిలో ఇంకిపోయింది.

కామెంట్‌లు లేవు: