26, ఆగస్టు 2010, గురువారం

పయనం



జోరున వాన , కొంతసేపటికి తెరిపించింది. ఇంకా మబ్బు ముసిరి వుంది. చల్లటి గాలి మెల్లగా వీస్తోంది. ఆ గాలికి ఆకుల మీద వున్న నీటి తెంపర్లు జల్లుగా కురుస్తున్నాయి. పూల రెక్కలు అందంగా వికసించాయి. వెన్నెల వెలుగులా వుంది చూడటానికి.

వాన విరిసిన తరువాత ఎవరికైనా చేయాలనిపించేది కాగితపు పడవలు. దానితో ఆడుకోవటం ఎంత వయసున్న వారికైనా ఆనందమే. అందులో ఆరేళ్ళ బాలుడుకి మరీనూ. అందుకే ఓ పెద్ద కాగితం తీసి అమ్మ నేర్పించినట్లుగా ఓ అందమైన పడవ చేసాడు.

అక్కడే ఉన్న చిన్న నీటి ప్రవాహంలో దానిని వదిలాడు. ఆ పడవ నెమ్మదిగా ఆ ప్రవాహానికి కదులుతూ ఆ గాలికి ఊగుతూ ముందుకు సాగుతోంది. ఇలా ఓ అందమైన పడవ ప్రాణం పోసుకుంది.

**********************************************************

ఇంతలో అమ్మ పిలవటంతో ఆ బాలుడు లోపలికి వెళ్ళాడు.

అలా అలా కదులుతూ ఆ వర్షపు నీటిలో నుంచి ఓ పిల్ల కాలువలోకి చేరింది ఆ పడవ. చుట్టూ పచ్చని గడ్డి మధ్యలో ఈ ప్రవాహం ఆ ప్రవాహంలో పయనిస్తున్న పడవ, చూడటానికి ముచ్చటగా వుంది. ఇంతలో ఓ రాయి అడ్డురావటంతో ఆ పడవ అక్కడే ఆగిపోయింది.

కొంచం గాలి గట్టిగా వీస్తుందేమో, ఆ గాలి సహాయంతో ఆ రాయిని తప్పించుకోని వెళ్ళాలని ఆ పడవ వేచిచూస్తోంది. ఆ పక్కనే వున్న ఒడ్డు మీద చెట్టును చూస్తూ దాని ఆకులు ఎప్పుడు గట్టిగా కదులుతాయా అని ఆ పడవ వేచిచూస్తోంది. దాని మాటలు ఆ గాలి విన్నట్టుంది, వెంటనే గట్టిగా వీచింది.

ఆ గాలికి ఆ చెట్టు మీద వున్న పువ్వు ఒకటి ఆ పడవలో పడింది. ఆ పువ్వులో నుంచి ఓ చీమ బయటకు వచ్చి చుట్టూ వున్న నీటిని చూసి భయపడింది. ఆ భయంతో అటూ ఇటూ చూస్తూ వుంది. ఆ పడవకి ఆ చీమ బాధ అర్ధమైంది. మళ్ళీ రాయి ఎప్పుడువస్తుందా అని ఒడ్డు వైపు వెళ్తూవుంది. ఆ పడవ తను కోరుకున్నట్లుగా ఓ రాయికి తగిలి మళ్ళీ ఆగింది, ఈ సారి ఆ చీమకు సహాయం చేయటానికి. ఆ చీమ నెమ్మదిగా ఆ రాయి మీదకు ఎక్కి , అక్కడ నుంచి ఒడ్డుకు చేరుకుంది.

ఇప్పుడు ఆ పడవ మళ్ళీ గాలి ఎప్పుడు వీస్తుందా అని వేచిచూడటంతప్ప ఇంకేమీ చేయలేకపోయింది. ఆ పడవ తన చుట్టూ వున్న ప్రకృతిని చూస్తూ గడప సాగింది. చుట్టూ పచ్చటి గడ్డి, ఒడ్డున చెట్లు, నీటిలో అందమైన చేపలు ఇలా ఎంతో అహ్లాదంగా వుంది.

**********************************************************

ఇప్పటిదాకా జరిగింది అంతా ఓ బుజ్జి చేప పిల్ల చూడసాగింది. ఎందుకో ఆ బుజ్జి చేపపిల్లకు ఆ పడవ మొదటి చూపులోనే ఆకర్షించింది. ఓ అందమైన పడవ దానిని పువ్వుతో మరింతగా అందంగా అలంకరించినట్లు ఉంది.

ఇంతలో ఓ ఆకతాయి పిల్లాడు ఆ పడవను రాయితో కొట్టడానికి దూరం నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఆ బుజ్జి చేప వెంటనే ఆ పడవ దగ్గరకు వెళ్ళింది. ఆ పడవను ఆ రాయినుంచి తప్పించటానికి తన బలంతో దాన్నినెట్టసాగింది. ఆ చేపకు తోడుగా ఆ గాలికూడా సహాయపడసాగింది. గాలి వేగం, నీటి ప్రవాహంతో ఆ పడవ ఆ ప్రదేశం నుంచి తొందరగానే తప్పించుకుంది.

ఆ పడవకి కూడా ఆ చిట్టి చేప పిల్ల బాగా నచ్చింది. రెండూ ఒకదానిని ఒకటి చూసుకున్నాయి. ఆ రెండూ అక్కడ నుంచి తీయటి కబుర్లు చెప్పుకుంటూ ఆ నీటి ప్రవాహాన్ని ఈదుతూ వెళ్తున్నాయి.

**********************************************************

ఒక్కసారిగా అలజడి, ఆ నీటిలో ఆ పడవ మునిగిపోతుందేమో అనేంత నీటి ప్రవాహం. ఆ కాలువ నదిలో కలుస్తున్న సమయం.

ఆ పడవ అటూ ఇటూ ఊగుతూ ఆ అలజడిని తట్టుకోని ఆ ప్రవాహంలో కనిపించని ఆ బుజ్జి చేప పిల్ల కోసం వెతక సాగింది.

ఇక ఆ బుజ్జి చేపను ఏదో పెద్ద చేప తిని వుంటుందేమో అని బాధ పడుతున్న సమయంలో ఆ పడవ తన బుజ్జి చేప పిల్లను చూసి ఎంతో ఆనందించింది. పడవ సగం తడిచి వుండటం చూసి ఆ చిట్టి చేప బాధ పడసాగింది. ఇంతలో వెచ్చటి సూర్యకిరణాలు ఆ పడవ మీద పడసాగాయి. అలా ఆ రెండూ మళ్ళీ తమ పయనం మొదలు పెట్టాయి.

ఇందాక చూసిన ఆ ప్రకృతికీ ఈ ప్రకృతికీ చాలా తేడా వుంది. చుట్టూ జోరున ప్రవాహంతో నీరు, బాగా దూరంలో పెద్ద పెద్ద చెట్లు, నీటిలో పెద్ద పెద్ద చేపలు, ఏవేవో వస్తువులూ ఇలా అంతా కొత్తగా వుంది వాటికి.

************************************************************

ఇంతలో ప్రమాదం ముంచుకు వచ్చింది. ఓ పెద్ద చేప ఈ చేపను తినటానికి వస్తోంది. దాని పక్కనే ఓ పెద్ద పడవ కూడా వుంది - అది ఈ చిన్న పడవవైపు వస్తోంది.

వాటికి ఏమి చేయాలో అర్దంకావటం లేదు. ఇంతలో ఆ పడవకు ఓ ఉపాయం తోచింది. అది ఆ బుజ్జి చేప చెవిలో ఏదో చెప్పింది.



వెంటనే ఆ చేప పిల్ల గాలిలోకి ఎగురుతూ వుంది. ఆ పెద్ద పడవలో వున్న జాలరు దానిని చూసాడు. వెంటనే దాని ముందు వున్న పెద్ద చేపను చూసాడు. మరు నిమిషం లోనే ఆ జాలరు తన దగ్గర వున్న గాలంతో ఆ పెద్ద చేపను పట్టి ఇంకా ఏవైనా పెద్ద చేపలు తగులుతాయేమో అని తన పడవను అక్కడ ఆపి చూస్తూవున్నడు.

************************************************************

ఇలా రెండూ ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఇలా రెండూ ప్రకృతిని ఆశ్వాదిస్తూ ఒకరికి ఒకరు తోడుగా వుంటూ పయనిస్తూవున్నాయి.

ఇంతలో ఓ మహాద్బుతం , ఆ రెండూ తమను తాము నమ్మలేక పోయాయి. ఓ కొత్త ప్రపంచం చూస్తున్నట్లుగా ఉంది. అంతా నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఉవెత్తున ఎగిసిపడుతున్న అలలతో ఆహ్లాదంగా వుంది. అంతా అయోమయంగా వుంది. ఈ మహాద్బుతాన్ని జీర్ణించుకునేలోపే ఓ పెద్ద అల ఎగిసి వాటిమీద వడింది.

మరుక్షణంలోనే ఓ మొసలికి ఆ చిరు చేప పిల్ల ఆహారమైంది.

అలా ఆ రెండు అందమైన జీవితాలు ఓ అందమైన శుభోదయంలా తమ పయనం ప్రారంభించి , మళ్ళీ ఎక్కడో ఒక చోట తమ పయనం కొనసాగించటానికి ఇలా ఇప్పుడు అస్తమించాయి.

5 కామెంట్‌లు:

..nagarjuna.. చెప్పారు...

చాలా అందంగా ఉంది ప్రయాణం

..nagarjuna.. చెప్పారు...

ఈ పోస్టుకు నాదే మొదటి వ్యాఖ్యకావడం ఇంకా అందమైన ఆనందంగా ఉంది. సంవత్సర కాలం తరువాత పోస్టు వేసారు...ఇలాగైతే తొలకరి జల్లు అలగడంలో తప్పులేదుమరి!

manasa vadarevu చెప్పారు...

chala srujanatmakamga undi manusuni loni poralanu taakindi very nice

AB చెప్పారు...

బావుందబ్బా...

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

srikanth గారూ..., హృదయపూర్వక వినాయక చతుర్థి శుభాకాంక్షలు!

హారం