ఆదివారం ఉదయం, అలా బాల్కనీలో కూర్చుని కుడిచేత్తో సిగరెట్ ఎడమచేత్తో టీ తాగుతూ బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ...
"ఆహా ఇదీ జీవితం... నా సామిరంగా..."
"ఛస్తున్నా ఎధవ జీవితం గొడ్డెడు చాకిరీ చేస్తూ, మీరేమో హాయిగా ఆ దరిద్రాన్ని కాల్చండి."
"ఏమైంది రాజ్యం ఇప్పుడు ? "
"ఆ అటకమీదున్న పాత పేపర్లు, చెత్త అంతా తీసేయమని లక్షసార్లు మొత్తుకున్నా మీకుదానికి మాత్రం టైం ఉండదు. ఆ దరిద్రపు సిగరెట్టుకు మాత్రం టైం ఉంటుంది."
"ఈ రోజుకు ఇదొక్కటేలేవే."
"ఒకటా ? నూటొకటా ? ఇప్పటిదాకా నేను చెప్పింది ఏదైనా చేసారా అసలు ? నామాటకు విలువుంటేగా, ఆ అటక నాకు అంది చావదు లేకపోతే నేనే సద్దేదాన్ని"
పళ్ళెంలో ఉప్మాపెట్టుకొచ్చి " కొంచెం ఆ పేపర్లవరకూ సద్దేయండి."
"ఎంతైనా మీ ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు.. నా ఫేవరేట్ ఉప్మా ఇచ్చి పని చేయించుకుంటున్నావ్."
"సరేలేండి... తొందరగా తిని ఆ పని చూడండి."
చేయికడుగుతూ "ఉప్మాచేయటంలో నిన్ను కొట్టినోళ్ళులేరుపో... ఆ స్టూలు పట్రా పైకెక్కుతా"
"అక్కడే ఉంటుంది చూడండి నేను బయట పిండి రుబ్బుతున్నా"
"ఒక్క ఆదివారం రెస్టు తీసుకుందాం అంటే లేదు, ఏదోఒక పని చెబుతుంది"
"ఏదో అంటున్నారు ?"
"ఏంలేదు స్టూలు కనిపించింది పైకెక్కుతున్నా"
"అబ్బో చాలా చెత్తుందే... ఆ పిండి రుబ్బటం ఆపి ఇట్రా చాలా చెత్తుంది."
"ముందు మీరు స్టార్ట్ చేయండి నేను వస్తున్నా."
"అది తరువాత రుబచ్చు నాకు సాయంచేద్దూకాని ఇట్రా"
"అబ్బా ఛస్తున్నా, ఈ మనిషితో నేను లేకుండా ఒక్క పని కూడా చేయరు. వస్తున్నా వుండండి."
"పట్టుకో ఇది."
"నా సర్టిఫికేట్లు ఇక్కడవున్నాయా చచ్చామొన్నటిదాకా వెతుక్కోలేక."
"అందుకే ఒకచోట పెట్టుకోమనేది. ఇలా ఇష్టంవచ్చినట్లు పడేస్తారు."
"ఇవన్నీ న్యూస్ పేపర్లు, పక్కన పెడితే ఓపనైపోతుంది."
"ఇటివ్వండి"
"చిన్నప్పుడు ఎవరూ ఉత్తరాలు రాయటం లేదని నాకు నేను రాసుకున్నవి"
"పైత్యం ఇప్పుడొచ్చిందనుకున్నా చిన్నపటినుంచేవుందా ?"
"సర్లే ఇవన్నీ జాగ్రత్తగా పెట్టు"
"ఆ బంగారం మరీ, జాగర్తగా పెడతా "
"ఎల్ ఇ సీ లు , డాక్యుమెంట్లు చాలా వున్నాయే"
"జాగర్తగా చూడండి అన్నీ పారేయకండి"
"నాకు తెలుసులేవే ఏవి ఉంచాలో"
"ఇదేంటి రఘుగాడు రాసిన ఉత్తరం, ఇప్పటిదాకా చదవలేదే !"
"ఎప్పుడొచ్చిందో?"
"మూడు సంవత్సరాలైంది, వాడిని చూసికూడా ఇంచుమించు అన్నే సంవత్సరాలైంది. ఏంచేస్తున్నాడో ఎక్కడ వున్నాడో ! సరే నువ్వు వెళ్ళి ఆ పిండి సంగతిచూడు నేను ఈలోపు ఇది చదువుతుంటా..."
"సరేలే... మీరు ఈరోజు పూర్తిచేస్తారని నమ్మకం నాకులేదు, నా పనైయ్యేదాకా నేను రాను మీఇష్టం."
"సరే వెళ్ళు"
ఎప్పుడో తన ఫ్రెండ్ రాసిన ఉత్తరాన్ని ఇప్పుడు చదువుతున్నాడు రాఘవ.
*************************************************
రాఘవ ఎలా ఉన్నావ్ ?
నీకోసం మీ ఆఫీసుకి ఫోన్ చేసా చాలా సార్లు, కానీ నువ్వులేవు. నీతోకొంచెం అర్జెంటుగా మాట్లాడాలనిపించింది.
రేయ్ ఎందుకురా లైఫ్ లో అన్నీ నాకే జరుగుతాయ్ ? నేనేం చేసానురా పాపం. చాలా రోజులనుంచి ఉద్యోగం లేదు,
ఎన్ని ప్రయత్నాలు చేసినా రావటంలేదు. అమ్మని ఎప్పటికైనా నాదగ్గరకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే.
నీకు తెలుసుగా సీత. తనకి పెళ్ళి కుదిరింది. రేపు శ్రావణమాసంలో పెళ్ళి. నాకు ఏంచేయాలో అర్ధంకావటంలేదు. నాకు ఏకష్టమొచ్చినా నీకే చెప్పుకోగలను. ఒకసారి నీతో మాట్లాడాలి. పిచ్చోడినైపోతానేమో అని భయంగావుంది. మరీ డిప్రెషన్ లోకివెళ్ళిపోతున్నా. కొన్నిసార్లు ఏంచేస్తున్నానో కూడా తెలియటంలేదు. నువ్వు ఎప్పుడూ నన్ను అంత క్లోజ్ ఫ్రెండ్ గా చూడలేదనీ తెలుసు. కానీ ఎందుకో నాబాధ నీతో చెప్పుకుంటే కాస్త బయటపడతానేమో అనిపించింది. నేను ఎవరికీ అక్కర్లేనివాడినైపోతానేమో అనిపిస్తోంది. ఇంక నాజీవితం ఇంతేనేమో అని భయంగావుంది. సీత పెళ్ళి కూడా అయిపోతే నేను ఇంక ఉండటం వ్యర్ధం.
ఒకవేళ నాకేదైనా అయితే అమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఇది నా ఆఖరి ఉత్తరం కాకుడదని ఆలోచిస్తూ....
నీ రఘు.
****************************************************
పక్కనేవున్న మొబైల్ తీసుకొని ఫోన్ చేసాడు రాఘవ.
"హలో!"
"కుమార్ నేను రాఘవని, మన రఘు ఎక్కడ వున్నాడు ?"
"రేయ్, వాడు చనిపోయి దాదాపు 3 సంవత్సరాలౌతోంది. నీకు ఆ విషయం చెప్పటానికి అప్పట్లో చాలాసార్లు ఫోన్ చేసా, నువ్వు ఆఫీసులోలేవని చెప్పేవాళ్ళు.
ఏమైందిప్పుడు ?"
"ఈ మొబైల్‌లు మూడు సంవత్సరాల ముందు వచ్చినా లేక నేనీ ఉత్తరం మూడు సంవత్సరాల ముందు చూసినా వాడి విధి వేరేలా వుండేదేమో...!"
"నేను మళ్ళీ ఫోన్ చేస్తా" అని ఫోన్ కట్ చేసాడు రాఘవ.
"ఏమైందండి ?"
భార్య చేతిలో ఉత్తరం పెట్టి, "పాత పేపర్లు పైన పడేసాను అనుకున్నానేకాని, స్నేహాన్ని కూడా అటకెక్కించాను అనుకోలేదు."
"ఇప్పుడేవస్తా" అని అలా చమరిన కళ్ళతో బయటకువెళ్ళిపోయాడు.
5 కామెంట్లు:
ఎంతబాగుందో చదివాక ఈ ఉత్తరం :-)
అతి సాధారణ పదాలతో అసాధారణ ఉద్వేగాలు ఎలా పలికిస్తారు మాష్టారు మీరు! too good.
Very interesting. Every body is committing the same mistake time and again
kallato chadivi manasuto anubhavincha chala bagundi
ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి