7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

సైకిల్





"నాన్నని ఎన్నిసార్లు అడిగినా నాకు సైకిలు కొనియ్యటంలేదురా"
"అందరి బాబులూ అంతేరా మనం అడిగింది వాళ్ళెప్పుడిచ్చారు!"
"రేయ్ ఈరోజు ఎలాగైనాసరే నాన్నని సైకిలు కొనమని నక్సలైట్లు పోరాడినట్లు నేనూ మన ఇంట్లో కామ్రేడునవుతా"
"నీది పోరాటంకాదేమో పోట్లాడటం అనుకుంటా?"
"రేయ్ వస్తే సైకిల్తోనే లేకపోతే ఇదే లాస్ట్ టైం కలవటం, గుడ్ బై..."
"ఏడిచావ్... పద కొంపకి వెళ్దాం"
"నన్ను ఆశీర్వదించు"
"కామ్రేడ్...విజయోస్తు!"

**************************************

అలా మన టింకుగాడు ఓ సైకిల్ విప్లవం మొదలుపెట్టాడు.
ఈ దళానికి ఇద్దరే సభ్యులు. ఒకడు టింకు, రెండు వాడి అన్న బబ్లూ.
వీడు ప్రసిడెంట్, వాడు వైస్-ప్రసిడెంట్.

"అమ్మా నాకు సైకిల్ కావాలి" కొంచెం కోపంతో..
"నాన్ననడగరా నాకెందుకు చెబుతావ్?"
"నాకు ఎలాగైనా సైకిల్ కావాలి అంతే" కోపం అటకవరకూ ఎక్కింది.
"అయినా అన్నకేలేదు నీకెందుకురా సైకిలు ?"
"నేనెప్పుడేదడిగినా వద్దంటారు, మా ఫ్రండ్స్ అందరిదగ్గరా సైకిల్స్ వున్నాయి తెలుసా?" కోపం ఇంటికప్పుకు చేరింది.
"ఇప్పుడు నీకు సైకిల్ ఎందుకురా? రోడ్లమీద బలాదూర్లు తిరగటానికా?
ఎప్పుడైనా పుస్తకం పట్టుకొని పట్టుమని ఓ పది నిమిషాలు చదివావా ?
వాడిని చూడు చక్కగా కూర్చుని చదువుకుంటున్నాడు
బుద్ధి తెచ్చుకో వాడిని చూసి"
"పోమ్మా నువ్వు కూడా ఎప్పుడూ చదువు చదువు అంటావు. సరే పది నినిమిషాలు చదువుతాను సైకిల్ కొనమని నాన్నకి చెబుతావా?" కోపం ఇంటి కప్పు నుంచి నేలమీద పడింది.
"సర్లేరా నేను నాన్నతో మాట్లాడతాను ఎలాగూ వచ్చే టైమయింది"

మన కామ్రేడ్ కాసేపు పుస్తకం పట్టుకొని గచ్చుమీద కూర్చుని అటూ ఇటూ పోయే సైకిళ్ళను చూస్తూ తన సైకిల్ కోసం విప్లవగీతాలు పాడుకుంటూ కూర్చున్నాడు.

**************************************

ప్రతి పదినిమిషాలకి ఒక పేజీ తిప్పుతూ చదువుతున్నట్లు నటిస్తున్న విచిత్ర సోదరులు పేజీలుతిప్పటం ఆపి గుమ్మంవైపే చూస్తున్నారు.
"రేయ్ నాన్న వచ్చారు"
"రాని నేను మాత్రం మాట్లాడను, అలిగాను"
"ఏంటి కామ్రడ్ నువ్వు అలిగావా?"
"రేపు సైకిల్తోనే వస్తాను అని ఎవరో అన్నరు?"
"నా దగ్గర ఒక ప్లాన్ వుంది, తరువాత చెబుతా"

"ఏంట్రా ఈరోజు గోలచెయ్యకుండా బుద్ధిగా చదువుకుంటున్నారు?"
"అలాంటిదేమీలేదండి అలా నటిస్తున్నారంతే, సైకిలు కావాలని ఇప్పటిదాకా అరిచి, ఇప్పుడే అలిగాడు"
"నేనేమీ అలగలేదు"
"తర్వాత చూద్దంలేరా సైకిల్ గురించి, పదండి వెళ్ళి తిందాం"

**************************************

మరుసటి రోజు సామావేశానికి మళ్ళీ టైమయింది.
"ఏంట్రా ఈరోజు సైకిలుతో వస్తానన్నవ్ ? గుర్తుందా?"
"వచ్చాగా కాకపోతే అద్దె సైకిల్ తో"
"నిన్నేదో ప్లన్ అన్నవ్?"
"నిన్న ఎవరో అన్నారు, అమెరికాలో అయితే పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళే సంపాదించుకుంటారంట. ఇప్పుడు ఈ కామ్రేడ్ కూడా సైకిలుకి కావలసిన డబ్బు సంపాదిస్తాడు"
"ఇంతకీ ఏమి చేద్దామని?"
"స్కూలు అయిపోయాక మన భద్రం కొట్లో పనిచేస్తా"
"నాన్నకి తెలిస్తే అంతే"
"ఎవరికీ చెప్పకు, నేను సైకిల్ కొన్న తరువాత నాన్నకి చూపిస్తా. ఎలావుంది నా ప్లాను ?"
"విజయోస్తు కామ్రెడ్"

**************************************

ప్రతిరోజూలాగే ఈరోజు, ఈ రోజూలాగే మరో నాలుగు రోజులు గడిచిన తర్వాత
"అమ్మా! టింకుగాడు స్కూలుదగ్గర పడిపోయాడు, హాస్పిటల్ కి తీసుకెళ్ళారు
నాన్నకూడా ఇప్పుడు అక్కడేవున్నాడు"
"నువ్వు ఇంట్లోనేవుండు నేను హాస్పిటల్ కి వెళ్తాను"
"సరే"


"మీకు ముందే చెప్పాను కదా, ఇప్పుడు ఆప్రేషన్ చేయక తప్పదు, తరువాత ఓ ఆర్నెలలు రెస్టుతీసుకుంటే సరిపోతుంది."
"సరే డాక్టర్ , మందులతో తగ్గుతుందేమో అనుకున్నాం, ఇప్పుడు తప్పదంటున్నారు కదా, ఆపరేషన్ చేయిస్తాం డాక్టర్"

పైన చెప్పిన నాలుగురోజుల తరువాత ఓ ఆరేడు నెలలు గడిచాయ్. టింకుగాడు మళ్ళీ కామ్రేడ్ అయ్యాడు.

"అమ్మా నాకు సైకిల్ కావాలి"

వీడికి సైకిల్ వచ్చేవరకూ దాని చక్రంలా వీడూ రోజూ అలాగే తిరుగుతున్నాడు.

**************************************


"టింకూ నేను బయటకి వెళ్తున్నా ఈ పుస్తకం చదువుతూవుండు, ఇప్పుడే అరగంటలో వస్తా"
"సరే బబ్లూ"

పుస్తకం తెరవగానే అందులో ఒక కవరు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఉత్తరం తీసి టింకూ గాడు చదివాడు.
"ఆరు నెలల తరువాత ఈ అన్న నీకిచ్చే బహుమతి ఇదే కామ్రేడ్. నాన్నకి చెప్పకు. ఆ కవర్ తెరిచి చూడు"

కవర్ తెరవగానే అందులో వెయ్యి రూపాయలు వున్నాయి.
మొదటిసారి ప్రేమతో కళ్ళలో కన్నీళ్ళు వచ్చాయి. తనకోసం ఈ ఆరు నెలలూ తను పని చేసి ఆ డబ్బు తనకిచ్చాడని అర్ధమైంది టింకూకి.

"నువ్వు నిజమైన కామ్రేడ్ వి అన్నయ్య! నా గుండెలో నీస్థానం ఎప్పటికీ కొండంత ఎత్తునే వుంటుంది" అని మనసులో అనుకొని
"ఆగరా నేనూ వస్తున్నా ' అంటూ గబగబా బయటకి పరిగెత్తాడు.

చిన్నప్పటి ఆ ఉత్తరాన్ని మళ్ళీ చూసుకుంటూ, అన్నని తలచుకుంటూ, ఆ కధను తన కొడుక్కి చెప్పాడు టింకూ.

"దీన్నిబట్టి నీకేమర్ధమైంది?"
"అర్ధమైంది నాన్న, ఈజన్మలో నువ్వు నాకు బైకు కొనవని"

2 కామెంట్‌లు:

sarma చెప్పారు...

wonderful :)

Karthik చెప్పారు...

Hha..hhaa...:-):-):-):-):-):-):-):-)